Aug 27,2023 21:37

జిల్లా ఖజానా శాఖ అధికారి సయ్యద్‌ మహబూబ్‌

 రాయచోటి : ప్రభుత్వశాఖలో పంపుతున్న బిల్లులను సకాలంలో పాస్‌ చేసి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించి సకాలంలో జీతభత్యాలు అందించడమే తమ లక్ష్యమని జిల్లా ఖజానా శాఖ అధికారి సయ్యద్‌ మహబూబ్‌ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లు ఎంతమంది ఉన్నారు. ఎంతమందికి పెన్షన్‌ జీతభత్యాలు అందిస్తున్నారో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాల్లో ఖజానా శాఖ కార్యాలయాల వివరాలు తెలపండి?
అన్నమయ్య జిల్లాలో 9 ఖజానా కార్యాలయాలున్నాయి. ఉప ఖజానా కార్యాలయాలు మదనపల్లె, తంబళ్లపల్లె, వాల్మికిపురం, పీలేరు, రాయచోటి, లక్కిరెడ్డి పల్లి, రాజంపేట , రైల్వేకోడూరులో ఉన్నాయి. జిల్లా ఖజానా కార్యాలయం రాయచోటి జిల్లా కేంద్రంలో ఉంది.
ఖజానా కార్యాలయంలో పనులేమిటి?
ఉద్యోగుల జీతబత్యాలు, వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన నిధుల చెల్లింపులు, ఉద్యోగుల భవిష్య నిధుల చెల్లింపు, అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు డేటా బేస లో ఫీడ్‌ చేయిచడం, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ చెల్లింపులు, వివిధ పద్దుల ద్వారా ప్రతి నెలా జరిగిన జమ, ఖర్చు వివరాలు అకౌంటెంట్‌ జనరల్‌ వారికి నివేదికలు అందించడం వంటి విధులు నిర్వహిస్తాం.
ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు తెలపండి ?
రెగ్యులర్‌ ఉద్యోగులు 18, 277, సచివాలయ వాలంటీర్లు 8454, పెన్షనర్లు 9,978, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 956, కాంటాక్ట్‌ ఉద్యోగులు 11,96 ,మంది ఉద్యోగులు ఉన్నారు.
ట్రెజరీ చెల్లింపుల వివరాలు తెలపండి?
బిల్లులు పాస్‌ అయిన తరువాత సిఎం ఎంఎస్‌ ద్వారా ఆర్‌బిఐ పేమెంట్‌ గేట్వేకు బదలాయించబడి ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో చెల్లించబడతాయి. ప్రతినెల జిల్లాలో దాదాపు రూ. 279, 85,34,240 చెల్లించడం జరుగుతుంది.
ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు జరుగుతుందా?
జిల్లాలో ప్రస్తుతం ఉద్యోగాలలో బయో మెట్రిక్‌ అమలులో ఉంది. హెల్త్‌ డిపార్ట్మెంట్‌ బయోమెట్రిక్‌ను పరిశీలించి జీతభత్యాలను వేస్తున్నాం. త్వరలో మిగిలిన డిపార్ట్‌మెంట్‌లోనూ ఒక్కొక్కటిగా బయోమెట్రిక్‌ పరిశీలించి జీతభత్యాలు వేస్తాం.
సిబ్బంది కొరత ఏమైనా ఉందా ?
కొన్ని ఉపఖజానా కార్యాలయాలలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మా సిబ్బంది ఎక్కువ సమయం పని చేసి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.