Nov 17,2023 22:43

ప్రజాశక్తి-బంటుమిల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ పి రాజాబాబు పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాంమండల స్థాయి ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం శుక్రవారం స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి బుధ, శుక్రవారాలలో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఇదివరకు పెండింగ్లో ఉన్నవి క్రోడీకరించుకుని, వాటి పరిష్కారానికి జిల్లా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి, అర్జీదారులతో నేరుగా మాట్లాడి, తగిన విచారణ నిర్వహించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని, ఫోటో తీసుకుని గ్రూప్‌ లో పోస్ట్‌ చేయాలని అన్నారు. ఎస్టి కులానికి చెందిన నిరుపేద కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఆధార కార్డులు ఇప్పించవలసిందిగా కలెక్టర్‌ ను కోరారు తక్షణమే సంబంధిత అధికారులను విచారణ చేసి కార్డులు ఇవ్వాలి అని కోరారు. మండల పరిధిలో ప్రధానంగా తాగునీటి సమస్యపై ఎక్కువగా అర్జీలు అందాయన్నారు. బంటుమిల్లితోపాటు కత్తివెన్ను మండలంలో కూడా ఇదే సమస్య ఉందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన బడ్జెట్‌ కేటాయించి ఫిల్టర్‌ బెడ్స్‌ మరమ్మతులు చేయించడం జరుగుతుందని అన్నారు. అనంతరం కలెక్టర్‌ విద్యుత్‌ ప్రమాదాల నివారణకు చర్యలు, విద్యుత్‌ ఆదాకు చిట్కాలపై సిపిడిసిఎల్‌ ముద్రించిన గోడపత్రికలను జాయింట్‌ కలెక్టర్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బందర్‌ ఆర్డీవో ఎం.వాణి, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డిఆర్‌డిఏ పిడి పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, డీఎస్‌ఓ పార్వతి, డి ఎం అండ్‌ హెచ్‌ ఓ డాక్టర్‌ జి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.