Apr 25,2023 00:57
ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి-పంగులూరు: పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రావలసిన పెండింగ్‌ జీతాలు మొత్తం ఇవ్వాలని, పారిశుధ్య కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని, రాజకీయ నాయకుల ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పంగులూరులోని మండల పరిషత్‌ కార్యాలయం ముందు మండలంలోని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. నెలల తరబడి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నా అనారోగ్యాలకు గురవుతున్నా జీతాలు మాత్రం ఇవ్వటం లేదని, తమకు ముందు ఉన్న వారిని అడిగి జీతాలు తీసుకోమని ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు అనడం సరైనది కాదని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో, సిఐటియు మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌ బాబు, పంచాయతీ పారిశుధ్య కార్మికుల సంఘం కార్యదర్శి నూతలపాటి బాబురావు, పలు గ్రామాల పంచాయతీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.