Jul 10,2023 21:22

నిరసనలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు

కడప అర్బన్‌ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం ఐడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్‌వాడీ కోర్కెల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు 36 గంటల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోని వచ్చి తొమ్మిదిఏళ్లయినా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఐసిడిఎస్‌ లక్ష్యాలకు విరుద్ధంగా సెంటర్లు కుదించటానికి నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. యూనియన్‌ నిర్వహించిన పోరాటాల ఫలితంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.1,500, ఆయాలకు రూ.750, మినీ కార్యకర్తలకు రూ.1,250 పెంచుతామని ప్రకటన చేశారని తెలిపారు. ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. 2017 నుంచి టిఎ బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు. 2022, ఏప్రిల్‌ 25న సుప్రీం కోర్టు దేశ వ్యాపితంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం గ్రాట్యూటికి లబ్దిదారులను కుదించటానికి పోషణ ట్రాక్‌ యాప్‌ను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రయివేటీకరణ విధానంలో భాగంగా రకరకాల యాప్‌లు తెచ్చి పనిభారం పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2023-24 ఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల 26 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్కీం వర్కర్లకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి అంగన్‌వాడీలను నెట్టివేశారని చెప్పారు. పర్యవేక్షణ పేరుతో ఫుడ్‌ కమిషనర్‌ చిత్తా ప్రతాప్‌రెడ్డి అంగన్‌వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులోని హనుమాయమ్మ రాజకీయ కక్షలతో నిర్ధాక్షిణ్యంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మట్టిఖర్చులకు ఇచ్చే దిక్కులేదని పేర్కొన్నారు. స్కీం వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 36 గంటల నిరసనలో కార్యకర్తలు, ఆయాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 14 డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీక్షలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ, నాయకులు రామమోహన్‌, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, సత్యం, పాపిరెడ్డి, అంగన్‌వాడీ కోశాధికారి అంజనాదేవి, ప్రాజెక్టు నాయకులు భాగ్య, మేరి, కళావతి, సుబ్బలక్ష్మి, సుభాషిని, వసుంధర, విజయ, నాగలక్ష్మి, భారతి, అంజనమ్మ, ప్రమీళ, హుసేన్న, జయద్రం, కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
సిఎం నగర పర్యటన నేపథ్యంలో సిఐటియు జిల్లా ప్రధాన మనోహర్‌, నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవిని అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.