ప్రజాశక్తి - కాకినాడ
సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ కాకినాడ పీడీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో విఒఎల సంఘం అధ్యక్షురాలు డి.మేరీ అధ్యక్షతన విఒఎలు ధర్నా నిర్వహించారు. కార్యక్ర మంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పాల్గొని మాట్లాడారు. విఒఎల సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార న్నారు. కాజులూరు, కాకినాడ మండలాల్లో అక్రమంగా తొలగించిన విఒఎలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, జిల్లాలో అన్ని మండలాల్లో బకాయి ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కాలపరిమితి సర్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, యూనిఫామ్ అలవెన్స్ ప్రభుత్వమే ఇవ్వాలని లేదా ప్రభుత్వ యూనిఫామ్ సరఫరా చేయాలని, కార్మికులందరికీ గ్రూప్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని, విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారాన్ని తగ్గించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. విఒఎలతో కోడి పిల్లలను కొనుగోలు చేయించి వారి చేత అమ్మకాలు చేయించే పని మానుకోవాలని, కిరాణా సామగ్రి అమ్మకాలు చేయడం, ఒకవేళ అమ్మకం జరగకపోతే విఒఎలే కొనాలని వారిపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని అన్నారు. జిల్లాలో ఉన్న అధికారులు ఈ సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా పీడీ కె.శ్రీరమణికి అందజేశారు. దీనిపై పీడీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమానికి మద్దతు తెలియజేసిన సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ పద్మ, మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ ఈశ్వరి, సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ మెంబర్ ఎన్ శ్రీను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఒఎల సంఘం జిల్లా కార్యదర్శి జి మేరీ, బి.సత్య అనంతలక్ష్మి, సత్య, గంగా భవాని, ఎం.పద్మ, కె.సత్యవేణి, ఎ. సుగుణ, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
విఒఎల సమస్యలపై మాట్లాడుతున్న బేబీ రాణి










