పాలకొండ రూరల్: తమచే సంబంధం లేని పనులు చేయించరాదని, నాణ్యమైన సెల్ ఫోన్లు, 4-జి సిమ్ కార్డులు ఇవ్వాలని, ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్‌లు ఇవ్వాలని కోరుతూ స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ పాలకొండ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం వైద్యాధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ పట్టణంలో 9 సచివాలయాల పరిధిలో ఐదుగురు ఎఎన్‌ఎంలు మాత్రమే ఉన్నారని, నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పట్టణ జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్య లేదని, దీనివల్ల ఆశా వర్కర్లపై పని భారం పెరుగుతుందని, సంబంధం లేని ఆన్లైన్ వర్కర్లకు అన్ని స్వంత ఫోన్ ద్వారానైనా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, సెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నారని, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించడం, వ్యాక్సిన్ బాక్సులు తీసుకురావడం, ఆన్లైన్ వర్క్స్ భారాన్ని తగ్గించాలని, ఆన్లైన్లో లేదా రికార్డు ఒక పని ఒకసారి మాత్రమే చేసేలా చూడాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పరిధిలో ఉన్న సమస్యలన్నీ తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కె.గౌరీశ్వరి, కె.గౌతమి, శ్రీదేవి, కాంతామణి, లక్ష్మి, పార్వతి, రాధా, రాణి, కన్య, అనురాధ, ధనలక్ష్మి, రూపావతి, శారద, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.










