కాలపరిమితి సర్య్కులర్ జిఒ 64రద్దుకు డిమాండ్
ప్రజాశక్తి- రాజవొమ్మంగి : వెలుగు యానిమేటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడిఎ కార్యాలయాన్ని ముట్టడించి, ఆందోళన చేపట్టారు. ముందుగా బస్‌స్టాండ్ నుంచి ఐటిడిఎ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన విఒఎలు, ఐటిడిఎ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని 11 మండలాల వెలుగు యానిమేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐటియు రంపచోడవరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లపు వెంకట్, ఎం.వాణిశ్రీ మాట్లాడుతూ, మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యులర్ 64ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ఆర్థిక ప్రగతికి దోహదపడే యానిమేటర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలతో వారి కుటుంబాలు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి, కాలపరిమితి ఉత్తర్వులు రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వమిచ్చే అరకొర వేతనం రూ.ఎనిమిది వేలతో ప్రభుత్వయాప్‌లు, రవాణా ఖర్చులకే రూ.మూడు వేలు వరకు పోతుందని, మిగిలిన రూ.ఐదు వేలతో కుటుంబపోషణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలుకు అనుగుణంగా కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఏప్రిల్ నెల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విఒఎల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పలు డిమాండ్లతో ఐటిడిఎ ఎఒ, వెలుగు ఎపిడిలకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె.శాంతిరాజు, గిరిజన సంఘం జిల్లా నాయకులు టి.శ్రీనివాస్, కె.బాపన్న దొర పాల్గొన్నారు.










