Oct 29,2023 21:51

ఎమ్మెల్యేకు సమస్యను వివరిస్తున్న మహిళ

ప్రజాశక్తి - కొత్తచెరువు : మండలకేంద్రంలోని గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని పుట్టపర్తి ఎమ్మెల్యే డి శ్రీధర్‌ రెడ్డి ఆదేశించారు. ఆదివారం కొత్తచెరువు లోని ఎస్సీ కాలనీ, ధర్మవరం రోడ్డు, దర్గా కాలనీ, బుక్కపట్నం రోడ్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కారక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అందుకు సంబందించిన కరపత్రాలను అందజేశారు. గ్రామపంచాయతీలో పారిశుధ్యం, తాగునీరు, కల్వర్టుల మరమ్మతులు, విద్యుత్‌ స్తంభాలు తదితర సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి సంబందిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో సర్పంచి, కార్యదర్శి పర్యవేక్షించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఇంటి పట్టాలు అందలేదని పలువురు మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ జగన్మోహన్‌ రెడ్డి, గ్రామ సర్పంచి రాధా నాగరాజు, ఎంపీపీ భర్త రెడ్డప్ప రెడ్డి, జెడ్పీటీసీ గంగాదేవి శంకర్‌, వైసిపి నాయకులు వాల్మీకి శంకర్‌, శ్యాంసుందర్‌ రెడ్డి, షాజహాన్‌, సోమశేఖర్‌ రెడ్డి, ఎల్లప్ప, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.