ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమం కోసం గడపగడపకు తిరుగుతున్నామని వైసిపి రాష్ట్ర యువ నేత, మంచాల సింగిల్ విండో అధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మాలపల్లి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయా లేదా అనే విషయాలు తెలుస్తాయని తెలిపారు. దీని కారణంగా అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారం అందుతుందని చెప్పారు. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బుక్ లెట్‌ను అందజేసి పథకాల వివరాలను చదివి వినిపిస్తూ అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి లక్ష్మయ్య, నాయకులు గురురాజారావు పాల్గొన్నారు.
బుక్‌లెట్‌ను అందజేస్తున్న ప్రదీప్ రెడ్డి










