- సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
ప్రజాశక్తి-విజయవాడ: సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని ఎన్‌టిఆర్ జిల్లా 11వ మహాసభ పిలుపునిచ్చినట్లు నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక బాలోత్సవ్ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 15, 16 తేదీలలో విజయవాడలో జరిగిన జిల్లా మహాసభ నిర్ణయాలను వివరించారు. ఈ మహాసభలో నూతన కమిటీతో పాటు వివిధ రంగాల ఉద్యోగ, కార్మికులు ఎదుర్కొంటున్న 34 సమస్యలపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎన్‌టిఆర్ జిల్లాలోని విజయవాడ నగరం, నాలుగు మునిసిపాలిటీలు, 14 మండలాల నుంచి వివిధ రంగాలకు చెందిన నాయకులు ప్రతినిధులుగా పాల్గొని ఉద్యమాన్ని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు పలు సూచనలు చేశారన్నారు. ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల ఐక్యపోరాటాలకు సిద్దం కావాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నెలల తరబడి జీతాలు, అంగన్‌వాడీలకు బిల్లుల బకాయిలపై పోరాడాలని మహాసభ నిర్ణయించిందన్నారు. అలాగే హాకర్స్‌కు గుర్తింపుకార్డులు, ఉపాధి భద్రత సమస్యలు ఉన్నాయన్నారు. సుమారు 15 వేల సిఎన్‌జి ఆటోలు ఉన్నా సరిపడా గ్యాస్ స్టేషన్లు లేక అనేక అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులపై కాంట్రాక్టర్ల వేధింపులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ముఠా రంగంలో సాంప్రదాయాలకు భిన్నంగా యాజమాన్యాలు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలు వ్యవహరిస్తూ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పోలీసుల, కార్మికశాఖ అధికారులు సైతం యాజమాన్యాలకుఅనుకూలంగా ఆదేశాలిస్తున్నారన్నారు. ఆటో కార్మికులపై పోలీసు, ఆర్టీఎ అధికారుల కేసులు, జరిమానాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రక్షణ కోసం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మహాసభ డిమాండ్ చేసిందన్నారు. పరిశ్రమల్లోరక్షణ సదుపాయాలు కల్పించాలని, ఇపిఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని, మునిసిపల్ కార్మికులకు పూర్తి రోజు వారాంతపు సెలవు కోసం ఆందోళనలు చేయాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. ఇఎస్‌ఐ గుణదల హాస్పిటల్ శిధిలావస్థకు చేరుకొని మందులు, చికిత్సలు సక్రమంగా రోగులకు అందడం లేదన్నారు. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై పని భారం తగ్గించాలని, రాజకీయ జోక్యం వేధింపులు ఆపాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.సీతారాములు, కె దుర్గారావు, కార్యదర్శులు ఎ కమల, ఇవి నారాయణ, ఎన్ కోటబాబు తదితరులు పాల్గొన్నారు.










