
ప్రజాశక్తి-మండపేట
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించుకుంటే డిసెంబర్లో నిరవధిక చేపడతామని పలువురు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐ టియు ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా అంగన్‌వాడీల మొదటి మహాసభ సిఐటియు యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.కృష్ణవేణి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మలు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలకు గౌరవము, వేతనం లేదు
ఎంఎల్‌సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1975లో ఐసిడిఎస్‌ను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించిందని తర్వాత ఈ పథకాన్ని ప్రధానమంత్రి పోషణా పథంకంగా మార్చారన్నారు.13 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత శిశు సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం నీతి అయోగ్ ప్రవేశ పెట్టిన తర్వాత సంక్షేమ బడ్జెట్ ను కుదించిందన్నారు. తరువాత ప్రధాని మోడీ మిషన్ మోడీలోకి మార్చి ప్రభుత్వం ఆ బాధ్యతనుంచి తప్పుకునేలా చేశారన్నారు. జనం కదిలితే పాలకులకు భయం పట్టుకుంటుందని మాజీ సిఎం చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున ఉద్యమం లేచిందన్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీలకు గౌరవం, వేతనము లేదన్నారు. ఓట్ల కోసమే 2019లో జగన్ అంగన్‌వాడీలకు ఎన్నికల హామీ ఇచ్చారన్నారు. తెలంగాణా కంటే ఎక్కువగా రూ.వెయ్యి ఇస్తానన్న ఆయన హామీని తుంగలోకి తొక్కారన్నారని, సమస్యలపై పోరాడుతుంటే కేసులుపెట్టి భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని కేసులకు తాము భయపడేది లేదన్నారు.
అంగన్‌వాడీలపై నిఘా పెంచారు
అనంతరం సిఐటియు రాష్ట్ర నాయకులు బేబీరాణి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెద్దన్నగా వుంటానని గద్దెనెక్కిన సిఎం జగన్ అంగన్‌వాడీ సమస్యలను కనీసం అసెంబ్లీలో చర్చకు కూడా తీసుకురాలేదన్నారు. అనేక సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారి సమస్యలు పట్టించుకోకుండా అంగన్‌వాడీలు ఏంచేస్తున్నారోనంటూ వారిపై నిఘా పెంచారన్నారు. ప్రభుత్వం ఐసిడిఎస్ నిర్వీర్యానికి పాల్పడుతూ బడ్జెట్ తగ్గిస్తోందన్నారు. 2011 తర్వాత వేతనాలు పెంచలేదు సరికదా అంగన్‌వాడీ ఉద్యోగాలను అంగడిలో సరుకుగా అమ్ముకుంటున్నారన్నారు. పోరాటానికి పుట్టినిల్లు అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాల్సింది పోయి తగ్గుతున్నాయన్నారు. ఫుడ్ కమిషనర్ విజరు ప్రతాప్ రెడ్డి తదితరులు అంగన్‌వాడీలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారని ఇటువంటి వాటిని సహించేది లేదన్నారు. కేంద్రం మహిళలను కించపరుస్తుందని రెజ్లర్లు, మణిపూర్ సంఘటనలు దీనికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకపోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీలకు పెన్షన్, సంక్షేమ పథకాలు అందించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓట్లతో తగిన బుద్ధి చెబుతామన్నారు.
ఐసిడిఎస్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత
యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ మాతాశిశు మరణాలను తగ్గించడానికి కృషి చేస్తున్న ఐసిడిఎస్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు. సెంటర్ల కుదింపు అడ్డుకోవడంకోసం పోరాటాలు జరిగాయని దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ప్రైవేటీకరణ విధానాలతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రజల హక్కులను హరిస్తోందన్నారు. దేశంలో రైల్వే, స్టీల్ ప్లాంట్, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరించడంతో బాటు 44 లేబర్‌కోడ్‌లను రద్దు చేసిందన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిపై ఇడి, సిబిఐ కేసులు పెడుతుందన్నారు. విద్యుత్, గ్యాస్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు టిఎ, హెచ్‌ఆర్‌ఎ చెల్లించాలని లేని పక్షంలో డిశంబరు లో దేశ వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత స్థానిక బస్టాండ్ నుంచి కలువపువ్వు సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు కొవ్వూరు గోపాలకష్ణారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శులు నూకల బలరాం, దుర్గా ప్రసాద్, అంగన్‌వాడీ సిఐటియు నాయకులు రాణి, వెంకట దుర్గా, లక్ష్మి, సుజాత, నూకరత్నం,ఆదిలక్ష్మి, గంగాభవాని, బేబీ, సత్యవేణి, నరేంద్ర కుమార్, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభ అనంతరం ప్రతినిధులు సభ నిర్వహించారు.