Nov 09,2023 22:52

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన, సమాజ పరమైన సమస్యల పరిష్కారానికి అవసరమైన న్యాయ సలహాలు అందిస్తామని కొవ్వూరు పేనల్‌ అండ్‌ రిటైనర్‌ అడ్వకేట్‌ పెలూరి వెంకటపెద్దిలక్ష్మి అన్నారు. గురువారం శ్రీ చైతన్య తాపీ వర్కర్స్‌ యూని యన్‌(సిఐటియు) కార్యాల యంలో సంఘం అధ్యక్షులు మైగాపుల నాగేశ్వర రావు అధ్యక్షతన మండల న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ కొవ్వూరు జిల్లా కోర్టు నుంచి న్యాయ సలహాలు అందిస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సంక్షేమ బోర్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య తాపీ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి మద్దుకూరి దొరయ్య, తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్‌ బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1214 మెమో ద్వారా నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు నిలిపివేసిందన్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టి జిల్లాల విభజన ప్రకారం ఆన్‌లైన్‌ లాగిన్‌ మార్పులు చేయకపోవడం వల్ల కొత్తగా కార్డులు నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్‌పై పనిచేసే సిబ్బంది నియమకాలు చేయలేదని తెలిపారు. ఆఖరికి కొవ్వూరు కార్మిక శాఖ అధికారి పోస్ట్‌ భర్తీ చేయకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు, మాణిక్‌ రెడ్డి, హరిబాబు, వాడపల్లి యూనియన్‌ అధ్యక్షులు వీర త్రిమూర్తులు, అప్పన్న, కృపాదాస్‌, దేవన సత్యనారాయణ, టి. సూరిబాబు, కాళ్ళ శ్రీనివాస్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.