Nov 15,2023 21:35

ప్రజాశక్తి-ఆలమూరు
సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలోనే జెకెసి నిర్వహిస్తూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. కొత్తూరు సెంటర్లో ఎస్జెఆర్‌ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మండల స్థాయి 'జగనన్నకు చెబుదాం'(జెకెసి) స్పందన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జెసి శ్రీవాస్‌ నపూర్‌ అజరు కుమార్‌, ఆర్‌డిఒ ఎం.ముక్కంటి, ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు తోరాటి సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికార యంత్రాంగం హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ గ్రామ స్థాయి సమస్యలు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మండల స్థాయి అధికారులు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మొత్తం ఆలమూరు మండలం చేరుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆలమూరు మండలానికి వివిధ సమస్యలపై సుమారు 93 అర్జీలను స్వీకరించామన్నారు. ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి మాట్లాడుతూ జెకెసిలో స్వీకరించిన ప్రతి సమస్యను వారం లేదా పది రోజుల్లోనే పరిష్కరిస్తామన్నారు. .
వినతిపత్రం అందజేత
ఆరు గ్రామాలకు ప్రయోజనం చేకూరే మండలంలోని చెముడులంక సెంటర్‌ వద్ద తూర్పు డెల్టా ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన ఎదురుగా 216 ఎ జాతీయ రహదారిపై ఓపెన్‌ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ తమ్మన శ్రీనివాసు ఆధ్వర్యంలో గ్రామ నాయకులు అందరూ కలిసి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. జాతీయ రహదారుల ఉన్నతాధికారులతో చర్చించి ఈ ప్రాంతంలో ఓపెన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఐపి.శెట్టి, ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, ఎఎంసి చైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, నామాల శ్రీనివాసు, డిటిలు జానకి రాఘవ, జానకి రామయ్య, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.