
ప్రజాశక్తి -కనిగిరి : వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిషార్కానికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ డివిఎస్. నారాయణరావు తెలిపారు. కనిగిరి పురపాలక సంఘం పరిధిలోని 4వ, 5వ వార్డుల పరిధిలోని ఎస్‌సి పాలెం, గడ్డమీదపల్లి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో కమిషనర్ బుధవారం పర్యటించారు. ఆయా వార్డుల ప్రజలు ఎదుర్కొటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల తర్వాత ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడానికి నిర్దేశిత ప్రాంతాలను నిర్ణయించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో రెండు బోర్లు ఏర్పాటు చేసి నీటి సమస్య శాశ్వత పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి సమస్య ఉంటే సంబంధిత సచివాలయ ఇంజినీరింగ్ సిబ్బందికి ప్రజలు తెలియచేయాలన్నారు. పారిశుధ్యంపై అశ్రద్ధ వహించవద్దని శానిటరీ సెక్రటరీలకు సూచించారు. కమిషనర్ వెంట కౌన్సిలర్ ఎర్రబల్లి దేవరాజ్, నాయకులు గుండ్లతోటి మధు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.