ప్రజాశక్తి-చెరుకుపల్లి: గ్రామ పంచాయతీల పరిధిలోని సమస్యల పట్ల ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు అన్నారు. చెరుకు పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరయిన ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ రానున్న వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేరకు కాలువల ద్వారా వచ్చిన నీటిని చెరువులకు మళ్లించి మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు, గ్రామ సర్పంచులకు ఆయన సూచించారు. పలు గ్రామాలలో కరెంటు స్తంభాల కొరత ఉందని, శివారు ప్రాంతాలకు విద్యుత్ స్తంభాలు వేయాలని పలువురు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యలు మోపిదేవి దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా ఆదేశించారు. మండల పరిషత్ అధ్యక్షులు మత్తి దివాకర రత్న ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జడ్పిటిసి సభ్యులు మర్రివాడ వెంకట పావని, మండల పరిషత్ ఉపాధ్యక్షులు, ఎంపీడీవో బి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










