May 14,2023 00:03

గిరిజనులకు వివిధ సామగ్రి అందజేస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ తదితరులు

అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాత్సవ
ప్రజాశక్తి- పెదబయలు

కొండ్రు గ్రామంలో సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అసిస్టెంట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సౌజన్యంతో మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధి కొండ్రు గ్రామంలో 92 మంది మహిళలకు ప్యాడ్స్‌, వాషింగ్‌ సోప్స్‌, టూత్‌ బ్రష్‌, టూత్‌ పేస్ట్‌, నైటీలు, మాస్కులు, 65 మంది పురుషులకు లుంగీలు, సబ్బులు, మాస్క్‌లు శనివారం పంపిణీ చేశారు. ఇందులో పాల్గొన్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో మంచినీరు, ఆధార్‌ కార్డులు, స్కూల్‌ బిల్డింగ్‌, అంగన్వాడీ బిల్డింగ్‌ సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధి జయలక్ష్మి మాట్లాడుతూ కొండ్రు లాంటి అతి మారుమూల గ్రామంలో ఈ సామగ్రి పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని, మరిన్ని కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీడీవో పూర్ణయ్య మాట్లాడుతూ గతంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితో కలిసి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని, ఆ సమయంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన కొన్ని సమస్యలను పరిష్కరించామని, కొన్ని సమస్యలు విడతల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. సంబంధిత గుత్తేదారులతో మాట్లాడి త్వరలో గ్రావిటీ పథకాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజరి గ్రామ సర్పంచ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు సూర్య, లోహితాస్‌, మండల ఇంజనీరింగ్‌ అధికారి ఎస్‌ సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి గోపాల్‌, విఆర్‌ఓ సచివాలయం సిబ్బంది, మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.