ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండలంలో లింగరాజుపాలెం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహాన్ని బిసి వెల్ఫేర్, సినీ ఆటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సందర్శించారు. బాలికలకు మౌలిక వసతులు లేవని వచ్చిన వార్తలపై మంత్రి స్పందించి వసతి గృహంలో గదులు, మరుగుదొడ్లను పరిశీలించి ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, విద్యార్థునుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, పాఠశాల భవనం చుట్టూ సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రక్షిత మంచినీటి పధకం కింద ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని, తక్షణమే ఈ భవనమును ఆధునీకరించడానికి రూ.6కోట్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. నూతన భవనానికి రూ.36 కోట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసారని, స్థలం పరిశీలనలో ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థ ఈ దుస్థితిలో ఉండడానికి చంద్రబాబే కారణమని, జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంత ప్రాధ్యానిత ఇస్తున్నారో అందరికి తెలుసునని తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ప్రిన్సిపాల్, ముగ్గురు బోధనా సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నామన్నారు. ఆయన వెంట పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఏ.కృష్ణమోహన్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సౌకర్యాలు లేవు : విద్యార్థినులు
మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో బాలికల వసతి గృహంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, ఇక్కడి సిబ్బంది తరగతులను సరిగ్గా నిర్వహించ లేదని, సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్నామని తెలిపారు. వసతులు, స్నానపు గదులు లేక వరండాలో లైట్లు ఆర్పి బెడ్ షీట్లు అడ్డుపెట్టుకుని రాత్రిపూట స్నానాలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై విచారణ చేపట్టిన బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి, మహిళా కమిషనర్ సభ్యురాలు గడ్డం ఉమా మాట్లాడుతూ, త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏ లక్ష్మీపతి, ప్రాజెక్ట్ డైరెక్టర్, అనకాపల్లి
డిప్యూటీ డిఇఓ ప్రేమ్ కుమార్, ఎంఈవో మూర్తి పాల్గొన్నారు
కనీస సౌకర్యాలు ఏవీ?
మాజీ ఎమ్మెల్యే అనిత
వసతి గృహాన్ని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె విద్యార్థునుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేని ఈ ప్రభుత్వం నాడు నేడు పేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. త్వరతగతిన సమస్యలను పరిష్కరించి ఇప్పటికైనా అధికారులు విద్యార్థినులకు సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆమె వెంట పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
హాస్టల్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ
లింగరాజుపాలెం గ్రామంలో బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాల తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించిన ఆమె విద్యార్థునుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల భవనం మార్చేందుకు దార్లపూడి గ్రామంలో భవనాన్ని పరిశీలించారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.










