Jul 27,2022 23:17

కన్నబాబుకు వినతిపత్రం అందిస్తున్న జివిఎంసి కాంట్రాక్టర్లు

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : జివిఎంసి స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు వైసిపి ఇన్‌ఛార్జిగా వచ్చిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును జివిఎంసి కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వీరారెడ్డి, కన్వీనర్‌ గొంప చంద్రమౌళి మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై రెండు వినతిపత్రాలు అందించారు. మూడు సంవత్సరాలుగా స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నిధులు విడుదలకాక బిల్లులు చెల్లింపులు జరపడం లేదని, కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. అందువల్ల జివిఎంసి సాధారణ పద్దులోనుంచి చెల్లింపులు జరిపేటట్లు అనునుమతులు ఇప్పించాలని కోరారు. రూ.100 కోట్లు బిల్లులు విడుదల చేయాలని కోరారు. కన్నబాబు సానుకూలముగా స్పందిస్తూ ఈ వారంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లాల కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డితో సమన్వయ సమావేశము ఏర్పాటుచేసి సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని కాంట్రాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే నాగిరెడ్డి, సమన్వయకర్తలు కెకె.రాజు, అక్కరమాని విజయనిర్మల, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, సతీష్‌, ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాస్‌, కాంట్రాక్టర్లు అప్పారావు, ఎం.రమేష్‌ పాల్గొన్నారు.