తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్‌్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీలు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. రూ.26వేలు కనీసం వేతనం అమలు, ఫేషియల్ రికగేషన్ హాజరు విధానం రద్దు, ఉద్యోగ భద్రత ఇతర సమస్యలపై ఆందోళన చేపట్టి, వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వం స్పందించి , తక్షణమే తమ సమస్యలను పరిష్కరించకుంటే వచ్చేనెల 6న కలెక్టరేట్ల వధ్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
- ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం
పజాశక్తి -నర్సీపట్నం టౌన్ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకురాలు వి.సామ్రాజ్యం మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ , ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఫేషియల్ రికగేషన్ యాప్ ద్వారా హాజరు విధానాన్ని రద్దు చేయాలని కోరారు అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులు చెల్లించాలని కోరారు. అప్పులు చేసి, పిల్లలకు ఆహారం పెట్టే పరిస్థితుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. రకరకాల యాప్‌లతో పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి వచ్చేనెల 6న కలెక్టరేట్ వద్ద ఆందోళనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాగమణి పర్వీన్ పాల్గొన్నారు. అనంతరం సిడిపిఒ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు
నర్సీపట్నం టౌన్ : సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, గ్రాటూ, ఇతర సౌకర్యాలను కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నేతలు కోరారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌డిఒ జయరామ్‌కు అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఎం అప్పలరాజు, ఉపాధ్యక్షులు నవర మణి, కార్యవర్గ సభ్యులు రొంగల సత్య, పులగోరు వరలక్ష్మి, నర్సీపట్నం ప్రాజెక్టు నాయకులు ఘాటీలమ్మ, చిన్నారి, రాజేశ్వరి పాల్గొన్నారు.
నక్కపల్లి : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, కార్యదర్శి నూకరత్నం, రమణమ్మ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వీసులో వుండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, జాబ్ కేలండర్ నిర్ణయించాలని కోరారు. సిడిపిఒ శ్రీవిద్యకు సంఘ ప్రతినిధులు కవిత, లక్ష్మీరాజ్యం, భవానీ, జ్యోతి, పద్మ,లక్ష్మి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు త్రినాధ్ వినతిపత్రం సమర్పించారు.
భీమునిపట్నం : అంగన్‌వాడీలకు కనీస వేతనం నెలకు రూ26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) భీమిలి ప్రాజెక్ట్ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రాజెక్ట్ గౌరవాధ్యక్షులు కె.వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఫేస్ యాప్ రద్దుచేయాలని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, అంగన్వాడీ కేంద్రాల తనిఖీల పేరుతో కార్యకర్తలపై వేధింపులు నిలిపి వేయాలని, 2017 నుంచి పెండింగులో ఉన్న టిఎ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి ఎస్.లక్ష్మి మాట్లాడుతూ, కేంద్రాలకు నాణ్యమైన వంట నూనె, కందిపప్పు, ఇతర సరుకులు సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్.శ్రీదేవి, జిల్లా కోశాధికారి కె పద్మ, నాయకులు ఎం.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆయా డిమాండ్లపై పిఒ ఎం.శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు.
కోటవురట్ల : కనీస వేతనం రూ.26వేలు అమలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. సిడిపిఒకు వినతిపత్రం అందించారు యూనియన్ నేతలు పుష్ప, చెన్నమ్మ డిమాండ్ చేశారు.
కంచరపాలెం : అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫేస్ యాప్‌ను రద్దుచేయాలని, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలను పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు బి.తులసి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్ అండ్ బి వద్ద ఉన్న అర్బన్-1 సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల, ఆయాలు మంగళవారం నిరసన చేశారు. ఇప్పటికే అప్పగించిన పలు యాప్‌ల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని, కొన్ని చోట్ల నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో మళ్లీ కొత్తగా ఫేస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు.. అనంతరం అర్బన్-1 సీడీపీఓ ఎంవి.రమణి కుమారికి వినతిపత్రం సమర్పించారు. జి.లక్ష్మి, బి.సంధ్య, ఎన్.ప్రియ, అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన మంగళవారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయో పరిమితి 50ఏళ్లకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని కోరారు.సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్తలు కెఎంఎస్.జయలక్ష్మి, బి.తులసి లక్ష్మి, పి.అంజలి, బి. కమల కుమారి, ఎస్.రజిని, టి .శ్యామల, కె. వరలక్ష్మి, కె.దేవి, విఎస్‌జి. పార్వతి తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సబ్బవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు వివి రమణమ్మ, బి.రమణమ్మ, సిహెచ్ దేవి, ఎం.రమణమ్మ, ఎస్. జగదీశ్వరి, పుస్పాదేవి, శివరామ లక్ష్మీ, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.










