ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం మండల స్థాయిలో జగన్న చెబుదాం 'స్పందన' కార్యక్రమం నిర్వహిస్తోందని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని డ్వామా కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గం మండల స్థాయిలో వచ్చిన అర్జీలను 10 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయాల్లో ఆస్తులకు సంబంధించి జరిగే క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సత్వర సేవలు సచివాలయాల ద్వారా అందేలా చూస్తామన్నారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధికి వినతి
118 సంవత్సరాల చరిత్ర కలిగిన రాయదుర్గం రైల్వేస్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నైరుతి రైల్వే హుబ్బల్లి డివిజన్ వినియోగదారుల సలహా మండలి మాజీ సభ్యులు గుడేకోట శివకుమార్, కలెక్టర్ కేతన్‌గార్గ్‌కు వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా నూతన భవనాలను ప్రారంభించి, మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాయదుర్గంలోని అనంతపూర్ రోడ్డు, కనేకల్ రోడ్డు వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన స్టేషన్ భవనాలలో ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలు, వేచి ఉండే గది, మరుగుదొడ్లు, తాగునీరు, రైలు వేళల ప్రకటన, వివరాల ప్రదర్శన పట్టిక, రాయదుర్గం జంక్షన్ అను పేరిట నోటీసు బోర్డుల ప్రదర్శన, క్యాంటీన్, క్యాటరింగ్, ఎంక్వయిరీ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో విప్ కాపు రామచంద్రారెడ్డి, ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్‌డిఎపి నరసింహారెడ్డి, హౌసింగ్ డిఇ శైలజ, డిఎల్‌డిఒ శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ కేతన్‌గార్గ్










