Jul 31,2023 22:25

విలేకర్లతో మాట్లాడుతున్న షరీఫ్‌

ప్రజాశక్తి - వినుకొండ : వైసిపి పాలనలోని అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారని, ఆధిపత్యం కోసం అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్‌ షేక్‌ షరీఫ్‌ విమర్శించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా మంగళవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన కోసం షరీఫ్‌ వినుకొండకు సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వాలంటీర్లను పార్టీ కార్యకర్తల వ్యవస్థగా సిఎం మార్చుకున్నారని, అనుకూలంగా లేకుంటే పథకాలు అందవనే స్థాకికి పరిస్థితిని దిగజార్చారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలుపుతూ లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారని, ప్రభుత్వ అవినీతి అక్రమాలను సెల్ఫీల ద్వారా ప్రజల ముందుకు తెస్తున్నారని అన్నారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా హామీలు ఇస్తున్నారని చెప్పారు. పాదయాత్ర ద్వారా లోకేశ్‌ ప్రజల్లో చైతన్యాన్ని తెస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి మంగళం పాడి రైతులను మోసం చేశాడని విమర్శించారు. చివరి దశలో ఉన్నవాటినీ పూర్తి చేయలేదన్నారు. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, ఆ పార్టీని ఓడించడానికి ఎదురు చూస్తున్నారని అన్నారు. టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టిడిపి పాలనలో ప్రవేశపెట్టిన 83 సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం తొలగించి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు చేసి దోచుకునేందుకు సిఎం నేరుగా లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ వారికి తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. జిల్లాలో పాదయాత్రకు స్వాగతం పలికేందుకు టిడిపి నాయకులు, శ్రేణులు వేలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం- పల్నాడు రోడ్డు మధ్యలో బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు 50-60 వేల మంది జనం పాల్గొననున్నారని తెలిపారు. పల్నాడు జిల్లాలో మంగళవారం ప్రారంభమయ్యే పాదయాత్రలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.