ప్రజాశక్తి-వన్‌టౌన్: రాష్ట్రంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కషి చేస్తామని ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షుడు రహీంఖాన్ తెలిపారు. వన్‌టౌన్ పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాలో గురువారం ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశం జరిగింది. 13 జిల్లాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 జిల్లాలకు సంబంధించిన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రహీంఖాన్ మాట్లాడుతూ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ముస్లిం ఐక్యవేదిక ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప ముస్లింల సంక్షేమానికి ఏ మాత్రం కషి చేయడం లేదని ఆయన విమర్శించారు. ముస్లింల సంక్షేమానికి ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన భూములను సంరక్షించడంతోపాటు ఆస్తుల పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు అహ్మద్ భారు తదితరులు పాల్గొన్నారు.










