Jul 07,2023 23:35

ప్రజాశక్తి - వినుకొండ: అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10, 11 తేదీల్లో నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే 36 గంటల ధర్నాలో అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కోశాధికారి ఎఎల్‌ ప్రసన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్‌ను స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టులకు బడ్జెట్‌ పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంట్రల్‌గా మార్చాలని అన్నారు. సర్వీస్‌లో ఉండి మృతి చెందిన వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని కోరారు. పిల్లలకు అమ్మబడి వర్తిపంజేయాలని, యూనిఫారం ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులను వెంటనే ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బి.వెంకటేశ్వర్లు నాసర్‌ బి, రంజాన్‌ బి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : గణపవరంలోని ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద పోస్టర్లను ఆవిష్కరించగా సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. తెలంగాణలో కంటే ఎక్కువ జీతం ఇస్తామని సిఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.ఐదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలనూ వర్తింపజేయాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్‌ సెలువులు ఇవ్వాలన్నారు. ప్రమోషన్లకు వయోపరిమిత 50 ఏళ్లకు పెంచాలని, రాజకీయ ప్రాబల్యాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. హత్యకు గురైన అనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సూపర్వైజర్‌ పోస్టులకు పరిమితి తొలగించాలని, పెండింగ్లో ఉన్న గ్రేడ్‌ సూపర్వైజర్‌ పోస్టుల్లో మిగిలిన 104 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షులు జి.సావిత్రి, అంగన్వాడీలు పాల్గొన్నారు.