
ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం మేజర్ పంచాయతీ కొత్తకోట ఎస్సీ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. కాలనీలో సుమారు మూడు వార్డులో మూడు వేలకు పైగా జనాభా ఉన్నారు. గత నాలుగు రోజులుగా తాగు నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులకు ముందస్తు ఆలోచనలు లేక పోవడంతో ఇంటింటి కుళాయిల పేరుతో గతంలో సరఫరా చేసిన పైపు లైన్ తొలగించారు. ప్రస్తుతం వేసిన ఇంటింటి కుళాయి ల పైపుల నుంచి నీరు సక్రమంగా రాక పోవడంతో తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ లో అపారిశుద్యం నెలకొంది. కాలవులు, రోడ్లపై చెత్త చెదారం తో నిండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. రాజ్ విధి మార్గంలో ( మెయిన్ రోడ్డులో) మినహ పారి శుధ్య పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ సమస్యలపై పంచాయతీ ఈఓ కృష్ణ మోహన్‌కు పలు మార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. మరోవైపు ఇంటింటి కొళాయిలు ఏర్పాటు పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వడంతో రాళ్లు, మట్టి కాలువల్లో కూరుకు పోయింది. కాలవులు నిండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. పంచాయతీ పరిధిలోని వార్డులలో అధికారులు, పాలకులు తిరిగితే సమస్యలు తెలుస్తాయి. కనీసం వారానికి ఒక్కసారైనా వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నా తపన వార్డు పాలకుల్లో కనిపించ లేదని స్థానికులు విమర్శించారు.