ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు భవనాలు శిథిలావస్థకు చేరి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కొన్ని భవనాల పైకప్పు స్లాబులు ఊడి పడుతున్నాయి. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. వసతులు పొందే గదులు తలుపులు, కిటికీలు మరమ్మతులు గురయ్యాయి. మరో వారం రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో సంక్షేమ హాస్టళ్లను కూడా తెరవనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 22 పోస్ట్ మెట్రిక్, 12 ప్రిమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది పిల్లలు ఏటా చేరుతున్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 1,058 మంది, 23 ప్రి మెట్రిక్ హాస్టళ్లలో 1048 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
అసౌకర్యాల చెరలో తప్పని అవస్థలు
పలు వసతి గృహాలు శిథిలావస్థకు చేరడంతో తలుపులు, కిటికీలు డోర్లు సరిగా లేవు. కాకినాడ జగన్నాథపురంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ప్రి మెట్రిక్, పోస్టు మెట్రిక్, ఒక కాలేజ్ హాస్టల్ ఉండగా సుమారు 300 మంది పిల్లలు ఉన్నారు. ఈ మూడు హాస్టళ్ల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలాజీ చెరువు సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ హాస్టల్ పూర్తిగా శిథిలమవడంతో దాన్ని ఖాళీ చేశారు. 1976లో నిర్మించిన ఈ వసతి గహంలో జిఎంసి బాలయోగి వంటి ఎంతో మంది ప్రముఖులు చదువుకున్నారు. గతంలో ఇందులో 200 మంది పిల్లలు వసతులు పొందేవారు. ఈ హాస్టల్‌ను భానుగుడి సెంటర్లో ఉన్న ఒక అద్దె భవనంలోకి మార్చడంతో కేవలం 60 మంది మాత్రమే మిగిలారు. గోలీల పేటలో ఉన్న ఎస్‌సి బాలికల హాస్టల్‌లో 100 మంది ఉంటున్నారు. పూర్తిగా శిథిల మవడంతో దానిని ఖాళీ చేసేశారు. కొండయ్యపాలెం ఎస్‌సి బాలికల హాస్టల్‌లో 90 మంది ఉంటుండగా అది కూడా శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న పిల్లల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. తునిలో ఉన్న రెండు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో సుమారు 200 మంది వుంటున్నారు. రెండు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారు. జగ్గంపేట మండలం రాజపూడి ఎస్‌సి బాలుర స్కూల్ హాస్టల్లో 130 మంది ఉండగా భవనం శిథిలావస్థకు చేరి, గదులు సరిపోక పిల్లలు ఆరు బయట నిద్రిస్తున్నారు. పలు హాస్టళ్లలో సరైన స్నానపు గదులు లేకపోవడంతో ఆరు బయటే స్నానాలు చేసే దుస్థితిని పలువురు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. బాలికల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అరకొరగా ఉన్న మరుగు దొడ్లు, స్నానపు గదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో పలువురు పేద విద్యార్థులు వసతి గృహాలకు చదువులకు దూరమవుతున్నారు.










