Sep 14,2023 21:29

విద్యార్థిని పేరును ఆన్‌లైన్‌ ద్వారా రేషన్‌కార్డులో చేరుస్తున్న అధికారులు

      చిలమత్తూరు : ''బతికుండగానే చంపేశారు'' అనే శీర్షికన గురువారం నాడు ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితం అయిన కథనంపై అధికార యంత్రాంగం కదిలింది. బతికుండగానే ఓ విద్యార్థినిని ఆన్‌లైన్‌లో చనిపోయినట్లు నమోదు చేయడం, దీని వల్ల విద్యార్థిని ఇంటర్‌ విద్యకు దూరం అయ్యే ప్రమాదంపై ప్రజాశక్తిలో పూర్తి స్థాయి కథనం ప్రచురితం అయ్యింది. గురువారం ఉదయం ఎంపిడిఒ నరేంద్రకృష్ణ దీనిపై స్పందించారు. సిబ్బందితో కలిసి బాధిత విద్యార్థిని కౌసర్‌ ఇంటి వద్దకెళ్లారు. ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యను ఒక్కరోజులో పరిష్కరించేలా చర్యలకు ఉపక్రించారు. సమస్యను జిల్లా టెక్నికల్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి వారితో మాట్లాడారు. ఏఈపీడీఎస్‌లో జరిగిన లోపాన్ని సరిచేసేందుకు అవసరం అయ్యే చర్యలు చేపట్టారు. వారి తల్లిదండ్రుల రేషన్‌కార్డులో అప్పటికప్పుడే విద్యార్థిని కౌసర్‌ పేరును చేర్పించారు. ఇంటర్‌ కళాశాల అడ్మిషన్‌ను పరిశీలించగా అందులో అడ్మిషన్‌కు అర్హత ఉన్నట్లు తేలింది. అయితే ఇంటర్‌ ప్రవేశానికి సమయం ముగియడంతో ఆర్‌ఐఒతో మాట్లాడి అడ్మిషన్‌ చేయించేలా ఒప్పించారు. విద్యార్థిని చదువుకునే సమయంలో ప్రభుత్వం ద్వారా అందించే అన్ని పథకాలు వర్తించేలా ఏర్పాటు చేస్తామని ఎంపిడిఒ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మూడేళ్ల పాటు పరిష్కారం కాని సమస్యను వెలుగులోకి తెచ్చి విద్యార్థినికి న్యాయం చేయడంలో ప్రజాశక్తి చూపిన చొరవను పలువురు అభినందించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన ప్రజాశక్తికి ఎంపిడిఒ, విద్యార్థిని కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.