ప్రజాశక్తి-సోమల ఆ గ్రామానికి నీటి కష్టం వచ్చింది. ఊరికి వచ్చే పైపు లైన్‌లో చెత్త పేరుకుపోవడంతో నీళ్లు నిలిచిపోయాయి. పైపులు మరమ్మత్తులు చేయకపోవడంతో సమస్య తలెత్తింది. గత్యంతరం లేక గ్రామస్తులు పంట పొలాల బాటపట్టారు. బిందెలతో నీళ్లు తెచ్చుకొంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ఒకటి, రెండు వారాలు కాదు.. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. ప్రజాప్రతి నిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా.. పరిష్కారం దొరకలేదు. ఇదీ సోమల మండలం అడుసుపల్లి గ్రామం నజంపేట దళితవాడ కుటుంబాల పరిస్థితి. పొలాల గట్లపై నుంచి మహిళలు బిందెలతో వస్తున్న ఆ చిత్రం సోమవారం ప్రజాశక్తి కెమెరాకు చిక్కింది. వారిని విచారించగా.. రెండు నెలలుగా నీళ్లు రాకపోవడం ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా ఆగిపోవడంతో కూలీ పనులు మానుకొని వ్యవసాయ బోర్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.










