Aug 13,2023 21:51

డంపింగ్‌ యార్డు ముందు ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-హిందూపురం : రూరల్‌ మండలం పెద్ద గుడ్డం పల్లి సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డును మరో చోటకు మార్చకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తామని ఎం బీరేపల్లి, పెద్దగుడ్డంపల్లి, చిన్న గుడ్డంపల్లి, మణేసముద్రం, మలుగూరు గ్రామానికి చెందిన ప్రజలు హెచ్చరించారు. ఈ మేరకు వారు ఆదివారం స్థానిక డంపింగ్‌ యార్డు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పట్టణంలో డంపింగ్‌ యార్డు లేక పోవడంతో గ్రామీణ మండలంలో దాదాపు 33 ఎకరాల్లో డంపింగ్‌ యార్డును చేశారన్నారు. ఈ డంపింగ్‌ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. డంపింగ్‌ యార్డు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్న ఇప్పటి వరకు యంత్రాలను ఏర్పాటు చేయలేదని, చెత్తతో పాటు జంతువుల కబేళాలను సైతం ఇక్కడ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీంతో దుర్వాసన ఎక్కువ ఉందన్నారు. కమిషనర్‌ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు తాము ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారంలోగా సమస్యను పరిష్కరించక పోతే గ్రామాల్లో దంరోరా వేయించి, పెద్ద ఎత్తున 5 గ్రామాల ప్రజలు మున్సిపల్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.