Jun 25,2023 00:51

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-కోటవురట్ల:సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడపగడపకు వైసిపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. మండల కేంద్రంలో శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.జగనన్న కాలనీ ఇల్లు వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని పలువురు కోరారు. పెట్రోల్‌ బంకు సమీపంలో కాలనీల నిర్మాణాలు పూర్తయినా తాగునీటి, వీధిలైట్ల, రోడ్ల సౌకర్యం లేక పోవడంతో ఇల్లు వృథాగా పడి ఉన్నాయని పలువురు తెలిపారు.పలు ప్రాంతాల్లో పారిశుధ్యం పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, స్థానిక సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా పథకాలు
నర్సీపట్నం టౌన్‌: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ తెలిపారు. మున్సిపాలిటీలోని 19వ వార్డు కొత్త బయ్యపురెడ్డిపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో సిసి రోడ్డు, రెండు మంచినీటి బోర్లు కావాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. సీసీ రోడ్డుకు రూ.5 లక్షలు అక్కడికక్కడే ఎమ్మెల్యే మంజూరు చేశారు. రెండు మంచినీటి బోర్లు సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ కోనేటి రామకృష్ణ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకా శివ, కౌన్సిలర్‌ శిరసపల్లి నాని, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మళ్ల గణేష్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్లు బషీరున్నీసా బేగం, అర్జున వెంకటరావు, కో ఆప్షన్‌ సభ్యులు భాషా, రోజా, సచివాలయాల కోఆర్డినేటర్‌ తమరాన శ్రీను, దాడి బుజ్జి పాల్గొన్నారు.