Aug 13,2023 22:28

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
             వేల్పూరు గోస్తని కాలువ ఒడ్డున ఉన్న శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అభివృద్ధి చేయాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామంలో శ్మశానవాటిక అస్తవ్యస్తంగా ఉందన్నారు. శ్మశానంలో పిచ్చి మొక్కలు, ముళ్లకంపలు, చెత్త చెదారంతో చిట్టి అడవిలా ఉందన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే ఈ శ్మశానం ముంపునకు గురవుతుందన్నారు. ఆ సమయంలో అంత్యక్రి యలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానవాటికలో విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో చనిపోయిన వారిని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఈ శ్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని గ్రామపంచాయతీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, అధికార పార్టీ నాయకులకు వినతిపత్రాలు అందించి రెండేళ్లు దాటినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానవాటిక అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరావు, రేవడి అంజి, కరేళ్ల మల్లికార్జునరావు, కుడక వీరభద్రరావు, కరేళ్ల రాంబాబు, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, కరేళ్ల అర్జున్‌, తాళ్ల గణేష్‌, రేవడి వీరబాబు, విశ్వనాథం, మహేష్‌, రేవడి వీరబాబు పాల్గొన్నారు.