May 31,2023 19:17

మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న కౌన్సిలర్‌ ఇందు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని హనుమాన్‌ నగర్‌లో ఉన్న శ్మశాన వాటికకు అదనంగా రెండెకరాల భూమి కేటాయించాలని 41వ వార్డు కౌన్సిలర్‌ బి.ఇందు కోరారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శ్మశాన వాటిక స్థలం కొరత ఉందన్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. హనుమాన్‌ నగర్‌, కిల్చిన్‌ పేట, వాల్మీకి నగర్‌, బోయ గేరి, శుక్రవారం పేట ప్రాంతాల వాసులు ఈ శ్మశాన వాటికలోనే మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు చెప్పారు. సుమారు 30 వేల జనాభా ఉన్న ప్రాంతంలోని ఈ శ్మశాన వాటికలో మృతదేహాలను పూడ్చిన చోటే పూడ్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. స్థలం కొరత వేధిస్తోందన్నారు. ఉన్న శ్మశాన వాటికలో కూడా ముళ్లకంపలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రం చేసి మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం, రహదారి ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. శ్మశానం వద్ద వ్యక్తిని నియమించి ఖననం కాగానే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేసి రశీదు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి హామీఇచ్చారు. కౌన్సిలర్లు ఫయాజ్‌ అహ్మద్‌, మహేశ్వరి ఉన్నారు.