
ప్రజాశక్తి - కొమరాడ : మృతదేహాలను శ్మశానానికి తీసుకువెళ్లాలన్నా, అటువైపు పొలాలకు వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని స్వామినాయుడువలసలో శుక్రవారం శ్మశానానికి రహదారి సదుపాయం కల్పించండని, రైల్వే లైన్ కింద అంతర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ శవాన్ని మోసుకుంటూ నినాదాలు చేస్తూ శ్మశానానికి వెళ్ళారు. ఈ సందర్భంగా కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ మృతదేహాన్ని కొత్తగా నిర్మించిన మూడో రైల్వే ట్రాక్‌పై మోసుకుంటూ స్మశానానికి రహదారి లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతూ రాళ్లపై నడుచుకొని ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యపై కలెక్టరేట్‌లో వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. ఇప్పటికే రెండు రైలు పట్టాలు దాటుకొని శవాన్ని తీసుకొని వెళ్లే సందర్భంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో మూలిగే నక్కపై తాటి పండు పడేలా మళ్లీ మూడో లైన్ ప్రారంభిస్తే మూడు రైలు పట్టాలు దాటి శ్మశానానికి శవాలు తీసుకొని వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందన్నారు. కావున రైల్వే శాఖ అధికారులు స్పందించి అంతర్ బ్రిడ్జి నిర్మించి శ్మశానానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి కోరుతున్నామని, లేనిచో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.