ఏలూరు కార్పొరేషన్‌లో అంత్యక్రియలకు
కనీస ఛార్జీ రూ.5 వేలుగా నిర్ణయం
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు
ఇదే అదునుగా మత చిచ్చు రేపేందుకు మతతత్వ శక్తుల కుటిలయత్నాలు
'ఆస్తి పన్ను పెంపు.. ఆపై చెత్త పన్ను వసూలు..' ఇలా పట్టణ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా భారాల మోత మోగుతోంది. అయితే ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ ఒకడుగు ముందుకేసి 'వదలా.. బొమ్మాళీ..' తరహాలో శ్మశానాల్లో కనీస ఛార్జీలు పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపుతూ తీర్మానించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిదీ వివాదాస్పదం చేసేందుకు 'గుంటకాడ నక్కల్లా' కాచుకుని కూర్చునే మతతత్వ శక్తులు భారాలపై పోరు కాకుండా జనం మధ్య చీలికలు తెచ్చేలా రెచ్చగొట్టే చర్యలకు దిగుతుండటం కలవరం సృష్టిస్తోంది.
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఇటీవల ఏలూరు నగర పరిధిలో శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలు చేసేవారు రూ.ఐదు వేలు కనీసంగా చెల్లించాలని కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. దీన్ని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టిడిపి, జనసేన, న్యూడెమోక్రసీ ఇలా అన్ని పార్టీలూ తీవ్రంగా ఖండించాయి. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 17 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ పదుల సంఖ్యలో దహన సంస్కారాలు జరుగుతుంటాయి. వీటికి ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోవిధంగా ఖర్చవుతోంది. దహన సంస్కారాలు అనేవి ఆయా కుటుంబాల వ్యక్తిగత అభిమతం బట్టి జరుగుతుంటాయి. వాస్తవానికి ప్రజలకు ఖర్చు లేకుండా విద్యుత్ శ్మశాన వాటికలను నగరంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దాన్ని పట్టించుకోని నగర పాలకులు వసూళ్లపర్వంకు ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది. దహన సంస్కారాలకు పుల్లలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి దాదాపు రూ.పది వేలు వరకూ అవుతుందని, దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే రూ.ఐదు వేలు చెల్లించాలని తీర్మానించినట్లు చెబుతుండటం విస్మయం కల్గిస్తోంది. ఈ సొమ్ము కాటికాపరుల కోసం వినియోగిస్తామనడం మరింత విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలకు ధరలు నిర్ణయించడం అనేది లేదు. దానికి భిన్నంగా ఏలూరు కార్పొరేషన్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలూ ముక్తకంఠంతో ఖండించాయి. దహన సంస్కారాలు అనేవి ఎవరి స్తోమతకు తగ్గినట్లుగా వారు చేసుకుంటారే తప్ప కార్పొరేషన్ ప్రత్యేకంగా ధర నిర్ణయించాల్సిన అవసరమేమిటని అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలంటే కాటికాపరులను కార్పొరేషన్ సిబ్బందిగా పరిగణించి వేతనాలు అందిస్తే బాగుంటుంది. అలాకాకుండా జనాల నుంచి సొమ్ములు వసూలు చేయాలని చూడటం అత్యంత దుర్మార్గమని చెప్పొచ్చు. దహన సంస్కారాల ఖర్చును అధికారికంగా వసూలు చేస్తే అది ఇంతటితో ఆగదు. ప్రతియేటా పెరుగుతూ ప్రజలకు భారంగా మారే పరిస్థితి ఏర్పడనుంది.
ఇదే అదునుగా మతతత్వ శక్తుల కుటిలయత్నాలు
శ్మశానాల్లో వసూళ్ల నిర్ణయాన్ని అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే కొన్ని మతతత్వ శక్తులు సమస్య పరిష్కారంపై కాకుండా జనం మధ్య చీలిక తెచ్చేలా మతచిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తుండటం కలవరం సృష్టిస్తోంది. హిందూ శ్మశాన వాటికలపై దాడి అంటూ రెచ్చేగొట్టేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీన్ని ఖండించి, సమస్య తీవ్రరూపందాల్చక ముందే పాలకులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కార్పొరేషన్ పాలకులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తద్వారా అటు ప్రజల మన్ననలు చూరగొనడంతోపాటు మతతత్వశక్తుల కుట్రలకు చెక్ పెట్టినట్లవుతుంది. లేనిపక్షంలో అధికారపక్షమైన వైసిపి మత విద్వేషాలకు కారణమవుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.










