Jul 13,2023 00:43
కరణం వెంకటేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల దుర్గారావు

ప్రజాశక్తి-చీరాల: మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలో ఉన్న శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల దుర్గారావు వైసిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ బాబును జగనన్న సురక్ష కార్యక్రమంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంచార జాతుల కుటుంబాలు అన్నీ శ్మశాన వాటిక చుట్టూరే ఉన్నాయని, నిత్యం అక్కడ మృతదేహాలను కాల్చడం, పూడ్చడం అన్నీ కనిపిస్తూ ఉంటాయని, చిన్న పిల్లలు వాటిని చూసి భయభ్రాంతులకు గురై అనారోగ్యపాలవుతున్నారని అన్నారు. శ్మశాన వాటిక నుంచి వచ్చే దుర్వాసనతో ఆ ప్రాంతంలో నివసించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కావున ప్రభుత్వ అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి, దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు షెడ్లు, మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి శ్మశాన వాటిక అభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని రామకృష్ణాపురం పంచాయతీ వాసులకు హామీ ఇచ్చారు.