Dec 19,2022 22:23

అఖిలపక్ష సమావేశం డిమాండ్‌
జిల్లా అధికారులకు వినతి
ప్రజాశక్తి - ఏలూరు

                    నగరంలో శ్మశాన వాటికల్లో రూ.ఐదు వేలు ఫీజు వసూలు చేయాలనే తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. సోమవారం ఉదయం స్థానిక ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి పళ్లెం కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ప్రజలపై యూజర్‌ ఛార్జీలు విధిస్తే బ్యాంకు రుణాలకు అనుమతులిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకు షరతు పెట్టిందన్నారు. కేంద్రం షరతులను వైసిపి తూచ తప్పకుండా అమలు చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే కరెంట్‌ ఛార్జీలు, చెత్త పన్ను ఆ విధంగానే పెరిగాయన్నారు. ఇప్పుడు ఎక్కడా లేనివిధంగా శ్మశానంలో ఛార్జీల వసూలు ప్రజలను పీక్కు తినడమేనని వ్యాఖ్యానించారు. సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు ప్రసాద్‌, టిడిపి మాజీ కార్పొరేటర్‌ బౌరోతు బాలాజీ, మాజీ నగర అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, జనసేన నాయకులు ఒ.శ్రవణ్‌కుమార్‌, నగర అధ్యక్షులు కాశీ నరేష్‌ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలకు రూ.ఐదు వేలు ఫీజు వసూలు చేయాలని తీర్మానించడాన్ని తప్పుబట్టారు. కాటికాపర్ల జీవన భృతి నిమిత్తం ఈ వసూళ్లని వైసిపి కార్పొరేటర్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. కాటికాపర్ల సంక్షేమం కోరే వారైతే 17 శ్మశానాల్లోని కాటికాపర్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందిగా గుర్తించి, వారికి నెలవారీ వేతన పద్ధతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్మశానాల్లో అనేక సమస్యలున్నాయని, తాగునీరు, షెడ్లు, టాయిలెట్లు, పారిశుధ్యం తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. నగరంలో తక్షణమే విద్యుత్‌ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్మశాన వాటికల్లో ఫీజు వసూలు సమస్యను కొన్ని మతతత్వ శక్తులు ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దీనికి అధికార వైసిపి బాధ్యత వహించాలన్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో శ్మశాన వాటికల్లో రూ.ఐదు వేలు వసూలు చేయాలనే తీర్మానాన్ని రద్దు చేయాలని, కాటికాపర్లను మున్సిపల్‌ సిబ్బందిగా గుర్తించాలని, విద్యుత్‌ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ సమావేశ అనంతరం కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో నేతలు వి.సాయిబాబు, బి.జగన్నాథరావు, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కాకి నాని, కాంగ్రెస్‌ నాయకులు చంద్రశేఖర్‌, జనసేన నాయకులు పవన్‌కుమార్‌ కిషోర్‌, శ్రావణ్‌ నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.