ప్రజాశక్తి - చీరాల
స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో తోటవారిపాలెంలో ఎస్సీ స్మశాన వాటికకు స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆందోళన చేశారు. డిప్యూటీ తహసిల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని మాట్లాడుతూ గ్రామంలో 30ఏళ్లకుపైగా నివాసం ఉంటున్న ఎస్సీలకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చనిపోయిన వారికి దహన సంస్కారాలు ఎక్కడ నిర్వహించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంత మంది చేసేది లేక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైపాస్ వద్ద దహన సంస్కారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యపై స్పందించి తోటవారిపాలెం ఎస్సీలకు అందుబాటులో స్మశాన స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో జిలాని, రహమత్, యాసిన్, బుజ్జి, సాంబయ్య పాల్గొన్నారు.










