Nov 15,2023 22:04

ఫొటో : తహశీల్దారు నాసా శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎబిఎం సంఘస్థులు

శ్మశాన స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి-ఉదయగిరి : 138 సంవత్సరాల పూర్వీకుల సమాధులున్న శ్మశానవాటికను కాపాడాలంటూ తహశీల్దార్‌ సానా శ్రీనివాసులు రెడ్డికి ఎబిఎం సంఘస్థులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్‌ 1295/4లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం 2.62 ఎకరాల స్థలాన్ని ఎబిఎం సంఘస్థులకు శ్మశాన స్థలంగా కేటాయించిందని తెలిపారు. చనిపోయిన తమ పూర్వికులను అక్కడే సమాధి చేశామంటూ వాపోయారు.
ప్రస్తుతం హైవే నిర్మాణంలో 1.17 సెంట్ల స్థలంలో సమాధులను పెకలించి హైవే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. దైవంలా భావించే పూర్వీకుల జ్ఞాపకాలను లేకుండా చేయడం బాధాకరమని తహశీల్దార్‌కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్పందించిన తహశీల్దార్‌ హైవే రోడ్డు నిర్వాహకులతో మాట్లాడి న్యాయం చేస్తామని సంఘ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో ఎబిఎం సంఘస్థులు ఆనందరావు, అశోక్‌,జాషువా, రవి, అబ్రహం, విజరు, సంపత్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.