ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామంలో గత రెండు నెలలుగా మూలుగుతున్న శ్మశాన సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలే శ్మశాన భూమికి కావాల్సిన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి హెచ్చరించారు. బుధవారం గౌస్‌దేశాయి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు చిన్న రోషన్న, సిపిఎం జిల్లా నాయకులు హనుమంతుతో కలిసి బి.అగ్రహారం గ్రామంలో పర్యటించారు. మనిషి చనిపోయి శ్మశాన స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడిన మాల రాజశేఖర్, బోయ మారెమ్మ, చాకలి ఆదెమ్మ కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. భూస్వామి కబ్జా చేసుకుని, అక్రమ పట్టా ద్వారా, రస్తా పేరుతో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న సర్వే నెంబరు 244లో 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బి.అగ్రహారం గ్రామంలోని బ్రహ్మంగారి దేవాలయం వద్ద కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభనుద్దేశించి గౌస్‌దేశాయి, రామాంజనేయులు, ఆనంద్ బాబు మాట్లాడారు. ఏ గ్రామంలోనైనా శ్మశానానికి ప్రభుత్వ భూమి లేకపోతే ప్రయివేట్ స్థలాన్నైనా కొని ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదని తెలిపారు. బి.అగ్రహారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నా దానిని భూస్వామికి ధారాదత్తం చేసి, తిరిగి శ్మశానం కోసం ప్రజలకు భూమి ఇవ్వడానికి దేవులాడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. అక్రమ పట్టా చేయించిన అధికారులను డిస్మిస్ చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా సస్పెండ్ కూడా చేయలేదన్నారు. అక్రమ పట్టా చేయించుకున్న వ్యక్తిపై ఎందుకు క్రిమినల్ కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. అధికారులు, భూస్వాముల లాలూచీతత్వానికి మధ్యన ప్రజలు బలవుతున్నారన్నారు. భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకునిగా పని చేసిన పుచ్చలపల్లి సుందరయ్య, పత్తికొండ ఎమ్మెల్యేగా పని చేసిన ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి లాంటి వారు, వారికున్న భూమినంతా పేదలకు పంచి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. అలాంటివారు మనకు ఆదర్శమన్నారు. గ్రామం మొత్తంగా మృతి చెందిన ప్రతిసారీ శ్మశాన స్థలం కోసం ఆందోళన చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ఈ పాలక పక్షాలు దళిత, బహుజనల వైపు ఉంటారో లేదా అధిపత్య భూస్వాముల వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని గ్రామస్తులే శ్మశానంలో జెండాలు పాతి స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. గ్రామ పెద్దలు గోవిందు, హనుమంతు, రాఘవేంద్ర, నరసింహుడు, గిరి రాజు, రామాంజిని, వెంకన్న, మహాలింగ, యాకాశి అంజినయ్య, మురళీ, రంగస్వామి, మౌలాలి, తిమ్మప్ప, వెంకటేష్, రంగమ్మ, నారాయణమ్మ, పెద్ద రంగమ్మ, మౌలాలమ్మ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి










