ప్రజాశక్తి-అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జెఎసి చేపట్టిన సమరయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన పోస్టర్‌ను బుధవారం స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో జెఎసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఈ సమర యాత్ర సాగుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, గిరిజన, పెట్రో యూనివర్సిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తదితర డిమాండ్లతో ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్‌వి నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ రమణ, డివిజన్ కార్యదర్శి గొర్లి తరుణ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వియ్యపు రాజు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్, పిడిఎస్‌ఓ నాయకులు భాస్కర్ పాల్గొన్నారు.










