Mar 06,2023 23:54

ప్రజాశక్తి-దేవరాపల్లి
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. సుస్థిర పరిశుభ్రతకు రాష్ట్రంలో 4,729 గ్రామాలను ప్రకటించామని చెప్పారు. కేంద్ర జల శక్తి, తాగునీరు, పారిశుధ్య శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లోని అన్ని రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్‌ నుంచి ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొని మాట్లాడారు. చెత్త నుండి సంపద కేంద్రాలలో భాగంగా గ్రామాల్లో 10,499 షెడ్లు నుండి 81.1 శాతం ఘనవ్యర్ధాల నిర్వహణ, చెత్త సేకరణ వాహనాల ద్వారా జరుతుందని తెలిపారు. మురుగు నీటి శుద్ధి కోసం తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అవలంభించడానికి గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 607 ప్రాంతాల్లో మరుగు నీటి శుద్ధి యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.83.62 కోట్లు మంజూరు చేయగా త్వరలోనే వాటి పనులు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఎస్‌ఎన్‌ఎ ఖాతా నుంచి రూ.123.99 కోట్లు ఖర్చు చేయగా రూ.83.34 కోట్లు బ్యాలెన్స్‌ అందుబాటులో ఉందని తెలిపారు. గ్రామీణ పారిశుధ్యం కోసం 15వ ఆర్థిక సంఘం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం 1163.40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయగా అందులో 80శాతం నిధులు వినియోగించామని చెప్పారు జిల్లా, మండల పరిషత్‌, గ్రామపంచాయతీలకు ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాలు తెరిచి వాటిని పిఎఫ్‌ఎమ్మెస్‌ విధానం ద్వారా నిధులు చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని వెల్లడించారు.