పోరుమామిళ్ల ; ప్రభుత్వం ప్రాథమిక విద్యకు పాతర వేస్తే ఉద్యమాలు ఉదతం చేస్తామని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా పేర్కొన్నారు. ఆదివారం యుటిఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా ప్రాంతీయ మహాసభలను పట్టణంలోని యుటిఎఫ్ మండల అధ్యక్షులు నాయబ్ రసూల్ అధ్యక్షతన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 49 వసంతాలు పూర్తయిందని 50వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా గత కాలంలో పనిచేసిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుల పోరాట ఫలితాలను, త్యాగాలను గుర్తు చేశారు. భవిష్యత్తులో 50 సంవత్సరాలకు సరిపడా ఉద్యమ స్ఫూర్తిని అందరిలో రగిలించడానికి సమావేశాలు తోడ్పడాయని తెలిపారు. విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల పోరాటంలో అలుపెరుగని రాజీలేని పోరాటాల ద్వారా ఎన్నో విజయాలు యుటిఎఫ్ సాధించిందన్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాళెం మహేష్ బాబు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల విలీనం వలన ప్రభుత్వ ప్రాథమిక విద్య పూర్తిగా దెబ్బతిని పాఠశాలలు మూతపడే స్థితికి వస్తున్నాయన్నారు. దీనిని ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఒక ప్రణాళిక బద్ధమైన ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు జెడ్ జయరామయ్య, కుర్రా చెన్నయ్య ఏజాస్ అహ్మద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు కష్ణయ్య, ఈశ్వరరావు భాస్కర్ రెడ్డి, నూనె శ్రీనివాసులు, రమణమూర్తి, సత్యనారాయణ, చెన్న కష్ణయ్య గంగయ్య రాఘవ, కేజె ప్రవీణ్, వెంకటేశ్వర్లు, పీవీ చంద్రశేఖర్, కిరణ్ కుమార్ ప్రధానోపాధ్యాయురాలు కే సుబ్బమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవి పాల్గొన్నారు.
జిపిఎస్ అమలు దుర్మార్గం
చాపాడు :రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసిందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా పేర్కొన్నారు. ఆదివారం మైదుకూరు ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోను ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్యారెంటీ లేని జిపిఎస్ విధానాన్ని అమలుపరిచేందుకు శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తాను చెప్పినట్లు పాత పెన్షన్ ఇవ్వాలి తప్ప మరో దుర్మార్గపూరితమైన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడితే ఒప్పుకోమని చెప్పారు. ప్రతి ఉద్యోగి 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తారని, అలాంటి ఉద్యోగి విరమణ పొందిన అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉండే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగి వచ్చే ఎన్నికలలోపు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి తీరాలని, అలా చేయని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏకమై ఉద్యమ కార్యాచరణ చేపట్టి ప్రభుత్వ దమన నీతిని ఎండ కడతామని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా కార్యదర్శి ఏజాస్ అహమ్మద్, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు కిరణ్ కుమార్ పాల్గొన్నారు










