May 30,2023 23:59

మాట్లాడుతున్న నర్సింగరావు

ప్రజాశక్తి-గుంటూరు : దేశంలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి, సమరశీల పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగారావు పిలుపునిచ్చారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి స్థానిక బ్రాడీపేట, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సిఐటియు నగర పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న నర్సింగారావు మాట్లాడుతూ ప్రస్తుత వర్గ పోరాట సిద్ధాంతాన్ని నిలబెట్టటానికి సిఐటియు ఆవిర్భవించిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ నిరంతరంగా కొనసాగుతోందని, కార్మిక శ్రమను మరింత దోచుకోవటానికి దేశంలో శాశ్వత పని స్వభావం కలిగిన నియామకాలు పక్కన పెట్టి, తాత్కాలిక పద్దతిలో నియామకాలు చేస్తున్నారని చెప్పారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, డైలీవేజ్‌ వంటివి అందులో భాగమేనని, ఆఖరికి రక్షణ రంగంలోనూ అగ్నిపథ్‌ పేరుతో తాత్కాలిక నియామకాలు చేపట్టారని విమర్శించారు. రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ, పెట్టుబడిదారులకు లాభాలు తెచ్చిపెడుతోందన్నారు. కోవిడ్‌లో అన్ని రంగాలూ దెబ్బతిన్నా పెట్టుబడిదారులు మాత్రం లాభాలు ఆర్జించారని చెప్పారు. మరోవైపు దేశంలో కార్మిక వర్గం ప్రశ్నించకుండా ఉండేందుకు బిజెపి ప్రభుత్వం కులం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 2024లో అధికారంలోకి వస్తే దేశాన్ని మత రాజ్యంగా ప్రకటించాలని చూస్తోందన్నారు. కార్మిక వర్గం బిజెపి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కార్మిక వర్గ పోరాటాలకు పదును పెంచాలని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ సిఐటియు ఏర్పడిన నాటి నుంచి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా 1991 నుంచి అమలు చేస్తున్న ప్రపంచ బ్యాంకు సంస్కరణల దుష్ప్రభావాలను కార్మికులకు వివరిస్తూ వాటిపై నికరంగా పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. ఇతర సంఘాలతో ఐక్య పోరాటాలు చేయటంలో, శ్రామిక శక్తులతో కలిసి పోరాటాలు నిర్వహించటంలో ముఖ్యభూమిక పోషిస్తోందన్నారు. రానున్న రోజుల్లో విశాల ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. సభలో సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, వి.దుర్గారావు, షేక్‌.హుస్సేన్‌వలి, ఎన్‌.శివాజీ, ఎం.భాగ్యరాజు, ఎన్‌.రమేష్‌బాబు, వై.సుబ్బారావు, ఎం.సాంబశివరావు, వివికె.సురేష్‌, సిహెచ్‌.కుమార్‌, అబ్దుల్‌ సలీం, వెంకటప్పయ్య, నళినీకాంత్‌ పాల్గొన్నారు.