ప్రజాశక్తి - కలెక్టరేట్ : ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ, విద్యార్థుల వద్ద, సమాజం వద్ద అవమాన పరిచేలా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్ వైఖరిని విద్యా శాఖాధికారుల అనాలోచిత ఉత్తర్వులపై ఉపాధ్యాయులంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని యుటిఎఫ్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి వల్ల ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. ముఖ ఆధారిత హాజరుపై అధికారులు మాట తప్పారని, గతంలో 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ , నెట్ వర్క్ లేని దగ్గర మినహాయింపు ఇచ్చారని, ఇప్పుడేమో నెట్ వర్క్, గ్రేస్ పీరియడ్‌తో తమకు సంబంధంలేదని 9 గంటలకే హాజరు పడాలని, లేనిచో చర్యలు తీసుకుంటామనడం దుర్మార్గమని అన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ ఈనెల 12న ఫ్యాప్టో పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వి.జ్యోతి, జిల్లా కార్యదర్శులు కె.మురళి, భాస్కరరావు, వెంకటినాయుడు, కె.కృష్ణారావు, ఎన్.శ్రీరాములు, జానకీరాం పాల్గొన్నారు.
12న కలెక్టరేట్ వద్ద ధర్నా : ఫ్యాప్టో
ఈనెల 12న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో జిల్లా చైర్మెన్ వి.ధనుంజయ నాయుడు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికై ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం స్థానిక వేదాంత కాలేజీలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ధనుంజయనాయుడు మాట్లాడుతూ, ప్రవీణ్ ప్రకాష్ వైఖరిపైనా, సిఎం హామీలు సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు 12 గంటల ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాప్టో డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ ముఖ ఆధారిత హాజరుపై అధికారులు మోసపూరితంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను తీవ్రభయాందోళనలకు గుర్తిచేస్తున్నారని అన్నారు. గతంలో 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, అలాగే నెట్ వర్క్ సమస్య ఉన్న దగ్గర మినహాయింపు ఇచ్చారని కాని ఇప్పుడు చర్యలు తీసుకుంటామని ఆదేశాలివ్వడం దుర్మార్గమని అన్నారు. ఈ చర్యలకు నిరసనగా ఈనెల 12న స్థానిక డిఇఒ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ రాత్రి 9గంట వరకు ధర్నా జరుగుతుందన్నారు. ఈ ధర్నాకు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశం పిసిహెచ్ శ్రీనివాసరావు, నల్ల బాలకృష్ణ, ఎం.శివున్నాయుడు పాల్గొన్నారు.










