Dec 29,2022 23:35

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు

కార్మిక చైతన్యయాత్ర జీపుజాతాకు ఘన స్వాగతం
ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా
మహాసభల వేదికగా కేంద్రానికి హెచ్చరిక
సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌.నర్సింగరావు
ప్రజాశక్తి-ఉక్కునగరం :
ప్రభుత్వ విధానాలతో కార్మిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలను వివరించి, వారిని సమరశీల పోరాటాలకు సన్నద్ధమయ్యేలా చైతన్యపరచడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కార్మిక చైతన్యయాత్ర జీపుజాతాలను నిర్వహిస్తున్నామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. జనవరి 2 నుంచి 4 వరకు భీమవరంలో సిఐటియు 16ప రాష్ట్రమహాసభల నేపథ్యంలో సిహెచ్‌.నర్సింగరావు నేతృత్వం వహిస్తున్న జీపుజాతా గురువారం కూర్మన్నపాలెం వచ్చిన సందర్భంగా ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేక రిలే దీక్షల శిబిరం వద్ద మాట్లాడుతూ, రాష్ట్రమహాసభల వేదికగా స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి హెచ్చరిక పంపిస్తామన్నారు. కేంద్రం విధానాలను సమర్థిస్తూ, రాష్ట్రంలో కార్మిక వ్యతరేక సంస్కరణలను వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్మికులను కనీసం ప్రశ్నించలేని విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సిఐటియు మహాసభల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికవర్గం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ దిశగా పోరాటాలపై అవగాహన పెంచుకొని సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్మిక, ప్రజాసంఘాల విశాఖ నగర జెఎసి కన్వీనర్‌ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సరం, భోగి, సంక్రాంతిలతోపాటు గ్రామ దేవత పండగల్లో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలను కలుపుకునే విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, వైటి దాస్‌, విళ్ళ రా మోహన్‌ కుమార్‌, డివి రమణారెడ్డి, సిహెచ్‌ సన్యాసిరావు, పరంధామయ్య, డేవిడ్‌, దాలి నాయుడు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర సిఐటియు మహాసభలు దిగ్విజయంగా జరగాలని, దీనిలో కార్మిక వ్యతిరేక విధానాలపై మరింత సమరశీల పోరాటాలు రూపకల్పన జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాస్‌, ఆర్‌ వి కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ కుమార మంగళం స్టీల్‌ సిఐటియు ప్రధానకార్యదర్శి యు రామస్వామి, నాయకులు జె అయోధ్యరామ్‌, పి శ్రీనివాసరాజు, ఎన్‌ రామారావు, ఒవి రావు, స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు నీరుకొండ రామచంద్రరావు, జె రామకృష్ణ, స్టీల్‌ సిఐటియు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక చైతన్య యాత్రకు ఘనస్వాగతం
తగరపువలస
: పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో జరగనున్న సిఐటియు 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని చేపడుతున్న కార్మిక చైతన్యయాత్రకు తగరపువలస హైవేలో వెంకటేశ్వర మెట్ట వద్ద యూనియన్‌ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు మోటారు బైక్‌ర్యాలీగా వెళ్లి ఘనస్వాగతం పలికారు.శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర ,విజయనగరం మీదుగా విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది. కార్మిక చైతన్యయాత్రలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింగరావు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సిఐటియు కార్యదర్శులు అమ్మినాయుడు, సురేష్‌ పాల్గొన్నారు. యాత్రకు స్వాగతం పలికిన వారిలో యూనియన్‌ భీమిలి జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, రవ్వ నరసింగరావు, సహాయ కార్యదర్శి ఎస్‌ అప్పలనాయుడు, నాయకులు నీలాతి రాము, మూర్తి, రీసు నరసింగరావు, కొత్తయ్య రెడ్డి ఉన్నారు.
గాజువాక : సిఐటియు రాష్ట్ర మహాసభల నేపథ్యంలో నిర్వహిస్తున్న కార్మిక చైతన్యయాత్ర గాజువాక చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం రాంబాబు, జోన్‌ కార్యదర్శి ఎ.లోకేష్‌ గొలగాన అప్పారావు, సురేష్‌ ఇతర కార్మికుల ఘనస్వాగతం పలికారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి నాయుడు, రాజు, గోవిందు పాల్గొన్నారు
ఆరిలోవ : సిఐటియు 16వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ తలపెట్టిన కార్మిక చైతన్య యాత్రకు జాతీయ రహదారి పాత డెయిరీఫారం కూడలి వద్ద విశాఖ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి కారులు, ఆటోలు, బైకులతో కార్మికదండు భారీర్యాలీగా హనుమంతువాక, ఇసుకతోట, మద్దిల పాలెం మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకు వెళ్ళారు. సిఐటియు జిల్లా జనరల్‌ సెక్రటరీ ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా సెక్రటరీ జగన్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కోఆర్డినేటర్‌ కన్వీనర్‌ కుమార్‌ మంగళం, మోటార్‌ ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ సెక్రటరీ జి.అప్పలరాజు, ఆటో యూనియన్‌ నాయకులు కె.సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్రావు, క్యాబ్‌ యూనియన్‌ సెక్రటరీ శ్రీరాములు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ యు.రాజు, ఎలక్ట్రికల్‌ మీటర్స్‌ యూనియన్‌ నాయకులు రామక్రిష్ణ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.