Jul 22,2023 23:27

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
- నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు
- ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చేదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అధికారులకు సూచించారు. జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో పలు శాఖల ఉన్నతాధికారులు, పోలీస్‌ అధికారులతో ఎస్‌పి అధ్యక్షతన శనివారం నిర్వహించిన అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులో కుల ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటిసిడెంట్స్‌ వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఆస్తి తగాదాల కేసులు నమోదవుతున్నాయని పోలీస్‌, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి వివక్షకు తావు లేకుండా కేసులు పరిష్కరించాలని సూచించారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తే నేర నమోదు రేటు తగ్గుతుందని తెలిపారు. భూ వివాదంలో సంబంధిత పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో కచ్చితత్వంగా ఉండాలన్నారు. అప్పుడే శిక్షల శాతం పెరుగుతుందని తెలిపారు. కేసుల విచారణలో సరైన సాక్ష్యాధారాలు, కేసు పత్రాలు సమర్పించాలన్నారు. ఎస్‌పి రాధిక మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. మహిళా భద్రతకు మహిళా పోలీసులతో క్షేత్రస్థాయిలో దిశ యాప్‌, మహిళా భద్రత, సైబర్‌ నేరాలు అరికట్టేందుకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం విభాగాల వారీగా నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు, రోడ్డు ప్రమాదాలు, మానవ అక్రమ రవాణా నివారణ, సైబర్‌ మోసాలు, సిసి కెమెరాల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం నేరాలు, మిస్సింగ్‌ కేసులు ఛేదన, కేసుల పరిష్కారం, దర్యాప్తు, సమాచారం సేకరణ, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచిన డిఎస్‌పి సిహెచ్‌.జి.వి ప్రసాద్‌, సిఐలు జి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, డి.గణేష్‌, అలీ మహ్మద్‌కు ప్రశంసాపత్రాలను అందజేశారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నిషాకుమారి, ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్‌, జె.తిప్పేస్వామి, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూటర్‌ ఎం.నాగమల్లేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు తిరుమలరావు, నాగభూషణ్‌, శివకుమార్‌, జిల్లాలోని పోలీసు అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.