Oct 29,2023 23:12

అభివాదం చేస్తున్న టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి-విజయనగరంకోట : రానున్న రోజుల్లో ఇకపై టిడిపి, జనసేన పార్టీ సమన్వయంతోనే ముందుకు వెళ్తాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు బుద్ధ వెంకన్న, జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు తెలిపారు. ఆదివారం స్థానిక విజయనగరంలో ఓ ప్రయివేట్‌ హోటల్లో టిడిపి, జనసేన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విజయనగరంలో కంపెనీల రావని, పరిశ్రమలు వచ్చినట్లు పేపర్ల మీద ఉంటాయని చెప్పారు. బోగస్‌ కంపెనీల గురించి వాళ్లు ఈ రాష్ట్రానికి 14 ఏళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. విజయనగరంలో ఎవరు లేఅవుట్‌ వేసిన కమీషన్‌ తీసుకుంటూ, ఎక్కడ ఖాళీ స్థలాలున్నా కబ్జాలు చేసుకున్న వాళ్లు ఉపసభాపతులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వైసిపి దొంగ నాటకానికి తెరతీసిందన్నారు.
ఎన్నికలు 120 రోజులు ఉంటుండగా బిసిలు, దళితులు, మైనారిటీలపై ఎక్కడి నుంచి ప్రేమ పూనుకొచ్చిందని ప్రశ్నించారు. ఇకపై టిడిపి, జనసేన కార్యకర్తలపై ఎవరైనా దాడి చేస్తే మూకుమ్మడిగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్‌ రెడ్డి చల్లపల్లి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు, టిడిపి, జనసేన నాయకులు కిమిడి నాగార్జున, లోకం మాధవి, పడాల అరుణ, గుమ్మడి సంధ్యారాణి, గురాన అయ్యలు, ఐవిపి రాజు పాల్గొన్నారు.