May 15,2023 23:22

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌, ఎస్‌పి



ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ జిల్లాను గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ వివేకానందహాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన నార్కో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, అడిషనల్‌ ఎస్‌పీ పి.శ్రీనివాస్‌ తదితరులతో పాటు రెవెన్యూ, పోలీస్‌, రవాణా, ఔషధ, విద్య, వైద్యం, ఆరోగ్యం, అటవీ శాఖల అధికారులు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గంజాయిని వినియోగించే వారి నుంచి సమాచారాన్ని సేకరించడం ద్వారా పెడలర్లను గుర్తించి ఉత్పత్తి, రవాణా, వినియోగం ఈ మొత్తం సరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు వీలవుతుందన్నారు. సమాచారం అందించేందుకు 14500 టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ ఈ నంబరును ప్రదర్శించాలన్నారు. జీజీహెచ్‌లోని డీ-అడిక్షన్‌ కేంద్రం తమ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్న వారి వివరాలను పోలీసు శాఖకు అందించా లన్నారు. సెర్చ్‌ అండ్‌ సీజ్‌ ఆపరేషన్స్‌లో సమన్వయ శాఖల అధికారులు భాగస్వాములు కావాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని విద్యా సంస్థలు, హాస్టళ్లు తదితరాల్లో ఆకస్మిక తనిఖీలకు మండల స్థాయిలో తహసీల్దార్‌ కన్వీనర్‌గా విద్యాసంస్థల ప్రతినిధులు, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌తో కూడిన ఉమ్మడి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిం చారు. ఈ కమిటీలు జిల్లాస్థాయి నార్కో సమన్వయ కమిటీ సమావేశాల తరహాలోనే మండల స్థాయిలోనూ ఎప్పటికప్పుడు సమావేశమయ్యేలా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ, విద్య, రైల్వే పోలీస్‌, అటవీ, ఏపీఎస్‌ ఆర్‌టీసీ, పోర్టు, వ్యవసాయం, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌, హౌటళ్లు, లాడ్జుల అసోషియేషన్లు, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసు అసోసి యేషన్ల ప్రతినిధులకు గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్‌ డా. కతికా శుక్లా మార్గనిర్దేశనం చేశారు.ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సరైన సమన్వయంతో పనిచేయడం ద్వారా జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఏదో ఒక శాఖ ద్వారా లక్ష్యాలను చేరుకోవడం కష్టమని.. సమన్వయ శాఖల సమష్టిగా విద్యా సంస్థల పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచామని.. రాత్రిపూట రైడ్‌లను ముమ్మురం చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రహదారుల వెంబడి తనిఖీలు నిర్వహణతో గంజాయి రవాణాను అడ్డుకోవచ్చన్నారు. నర్సీపట్నం-తుని రహదారి లోనూ చెక్‌పోస్టు ఏర్పాటు అంశంపై పరిశీలన చేయనున్నట్లు ఎస్‌పి సతీష్‌ కుమార్‌ వెల్లడించారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ కె.శ్రీరమణి, కాకినాడ ఆర్‌డిఒ బివి రమణ, డిఎస్‌పి కె.మురళీకష్ణారెడ్డి, డీఎఫ్‌వో ఐవీకే రాజు, డీఎంహెచ్‌వో డా. ఆర్‌.రమేష్‌, డిఇఒ కెఎన్‌విఎస్‌ అన్నపూర్ణ, ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు, విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.