Nov 06,2023 21:16

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

పార్వతీపురం: వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. జగన్నాథరావు పిలుపునిచ్చారు. వైద్యారోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సూపర్‌ వైజర్ల స్థాయీ అధికారులు, సిబ్బందితో సమన్వయ (కన్వర్జెన్స్‌) సమావేశం స్థానిక గిరిమిత్ర సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను రెండు శాఖలు సమన్వయంతో పక్కగా నిర్వహించి, పురోగతి సాధించడం ఈ సమావేశం లక్ష్యమన్నారు. ఈ మేరకు త్వరితగతిన గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేయడం, హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, రక్తహీనత నివారణ ప్రధాన లక్ష్యమని అందుకు ఐరన్‌ మాత్రలు, కాల్షియం మాత్రలు నిర్దేశించిన మోతాదులో అందజేయాలని, అదేవిధంగా పౌష్టికాహారం పూర్తి స్థాయిలో వినియోగించాలని అన్నారు. సంక్షేమ పథకాలు ( పిఎంఎంవివై, జెఎస్‌ వై, జెఎస్‌ఎస్‌ కె) గర్భిణీ లకు అందేలా చూడాలన్నారు. శిశువులు, పిల్లలకు ఇంటి వద్దనే ఆరోగ్య సంరక్షణ చేపట్టడం, సార్వత్రిక టీకాల కార్యక్రమం, బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పై గ్రామాల్లో, క్షేత్ర స్థాయిలో, సమావేశాల్లో పలు శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల న్నారు. సమావేశంలో ఐసిడిఎస్‌ పిడి ఎంఎన్‌ రాణి, డిఐఒ టి.జగన్మోహన్‌రావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ డి.శివకుమార్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఎం.వినోద్‌ కుమార్‌, డిపిహెచ్‌ఎన్‌ఒ ఉషారాణి, డిపిఒ లీలారాణీ, డెమోలు సన్యాసిరావు, యోగీశ్వరరెడ్డి, సిడిపిఒలు, ఆశా నోడల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.