Oct 21,2023 20:24

టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిఐఒ జగన్మోహన్‌రావు

ప్రజాశక్తి- పాచిపెంట : చిన్నారులు, గర్బిణుల ఆరోగ్య శ్రేయస్సుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన మంచాడవలస, గంగన్నదొరవలస, కర్రివలస గ్రామాలను సందర్శించి అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్బిణులకు నిర్వహించిన వ్యాధినిరోధక టీకా కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. టీకా కార్డులు, రికార్డులు తనిఖీ చేసి పిల్లలకు సకాలంలో టీకాలు వేస్తున్నారా లేదా అని పరిశీలించారు. టీకా గడువు తేదీలు పక్కగా నమోదు చేసి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. టీకా ఆవశ్యకతను వారికి వివరించాలన్నారు. గర్బిణులకు టిడి వ్యాక్సిన్‌ రెండు డోసులు కాలవ్యవధి ప్రకారం వేయడం జరిగిందా లేదా అని ఎమ్‌సిహెచ్‌ కార్డులో పరిశీలించారు. పిల్లలు, గర్భిణుల ఆరోగ్య పరిశీలన చేసి బరువు తక్కువగా ఉన్న వారికి పౌష్ఠికాహారం సరిగా వినియోగించాలన్నారు. ఆయన స్వయంగా పిల్లల బరువును అక్కడ పరికరం ద్వారా సరిసూచి రికార్డులో నమోదును పరిశీలించారు. హైరిస్క్‌ గర్భిణుల ఆరోగ్యాన్ని తరచుగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రసవ సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్తహీనత నివారణ చర్యలు చేపట్టాలని గర్భిణులు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ప్రతి రోజూ వేయాలని, ఆరు నెలల నుండి ఐదేళ్ళ లోపు పిల్లలకు వారానికి రెండు సార్లు ఐరన్‌ సిరప్‌ వేయించాలని సూచించారు. వైద్య, అంగన్వాడి సిబ్బంది సమన్వయంతో పనిచేసి మాతా శిశు ఆరోగ్య శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ శోభారాణి, సూపర్‌ వైజర్‌ జయ గౌడ్‌, వైద్య సిబ్బంది లీలావతి, శేషమ్మ, ఉషారాణి, గౌరీశ్వరమ్మ, అశోక్‌ కుమార్‌, వెంకటలక్ష్మీ, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.