ప్రజాశక్తి -భీమునిపట్నం : మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అమలుపై స్థానిక క్యాంప్ కార్యాలయంలో గురువారం భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసి సభ్యులు, పంచాయతీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలనుంచి అభివృద్ధి పనుల నిమిత్తం వచ్చిన వినతులను ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందునిమిత్తం ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిధులు రూ.2 కోట్లు, సచివాలయ నిధులు రూ.20 లక్షలతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర స్థాయిలో ఆన్‌లైన్‌లో సచివాలయం కేంద్రంగా జరుగుతుందని, ఇందులో తన స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల జోక్యం ఉండే అవకాశం లేదని వివరించారు. ఈ విషయంలో అవగాహన అవసరమని గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో మూడు మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసి సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఆర్‌డిఒ ఎస్.భాస్కరరెడ్డి, తహసీల్దార్లు, ఎండిఒలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










